- పొదుపును పెంచాలి
- ప్రధాని నరేంద్ర మోదీ
న్యూఢిల్లీ : మన దేశ సంస్కృతి పొదుపుపైనే ఆధారపడి ఉందని, తినడం, తాగడం, వినోదం మన ధోరణి ఎంతమాత్రం కాదని ప్రధాని నరేంద్ర మోదీ తన మంత్రివర్గ సభ్యులతో పేర్కొన్నారు. ఆర్థిక క్రమశిక్షణ పాటించకపోతే పేదరికం నుంచి బయటపడిన పౌరులు తిరిగి అదే పరిస్థితిలోకి వెళ్లిపోయే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు. న్యూఢిల్లీలోని భారత్ మండపంలో జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో మోదీ పలు అంశాలను ప్రస్తావించారు. 2011 – 2023 మధ్య సుమారు 50 కోట్ల మందిని పేదరికం నుంచి బయటకు తీసుకువచ్చామని ఆయన పేర్కొన్నారు.
కేవలం వారిని పేదరికం నుంచి తీసుకువస్తే సరిపోదని, తిరిగి వారు దానిలో కూరుకుపోకుండా పొదుపును ప్రోత్సహించడం ముఖ్యమని ఆయన తెలిపారు. దీనికి నిరంతర ప్రయత్నాలు అవసరమన్నారు. నక్సలిజం మళ్లీ తలెత్తకుండా నిరంతర చర్యలు కొనసాగించాలని, మంత్రులు, అధికారులు నిర్లక్ష్యంగా ఉండొద్దని హెచ్చరించారు. మాదకద్రవ్యాల ముప్పు, అంతర్గత భద్రత కూడా సమావేశంలో చర్చకు వచ్చినట్టు అధికార వర్గాలు తెలిపాయి.