- ఎంపీ సీట్ల పెంపు హామీకి ప్రతిపక్ష పార్టీలు లొంగవద్దు
- రాజ్యసభ ఎంపీ సిబల్ అభ్యర్థన
PNB News, 24 నవంబర్ 2026: న్యూఢిల్లీ: లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజనలో ప్రతి రాష్ర్టానికి 50 శాతం సీట్లు పెంచుతామంటున్న బీజేపీ మాటలు నమ్మవద్దని రాజ్యసభ సభ్యుడు కపిల్ సిబల్ ప్రతిపక్ష పార్టీల్ని అభ్యర్థించారు. అందుకే వర్షాకాల సమావేశాల్ని వాయిదా వెయ్యకుండా బిల్లు ఆమోదం పొందటానికి కావాల్సిన 362 సభ్యుల మద్దతు కోసం బీజేపీ చూస్తోందన్నారు. జనగణన తర్వాత 2027లో రాజ్యాంగ సవరణ ద్వారా నియోజకవర్గాల పునర్విభజన చేసే అవకాశం ఉన్నప్పటికీ, ప్రస్తుతమున్న సీట్లకు అదనంగా యాభై శాతం సీట్లు పెంచుతామని రాష్ర్టాలను బీజేపీ మభ్యపెడుతోంది అని సిబల్ ప్రెస్ మీట్లో వివరించారు.
ప్రస్తుతం తమిళనాడుకున్న 39 సీట్లు 59కి, ఉత్తరప్రదేశ్‌కు ఉన్న 80 సీట్లు 120కి పెరుగుతాయన్న ఆయన… తమిళనాడు, యూపీ మధ్య ప్రస్తుతమున్న తేడాకు పునర్విభజన తర్వాత ఉన్న తేడాకు చాలా వ్యత్యాసం ఉంటుందన్నారు. ఈ విధానం వల్ల బీజేపీ అధికారంలో ఉన్న ఉత్తరాది రాష్ర్టాల్లో సీట్లు పెరుగుతాయని చెప్పారు. గతంలో అస్సాం, జమ్ము కశ్మీర్లో ఇలాగే పునర్విభజన చేశారన్నారు. ఈ బిల్లు ఆమోదం పొందితే ఆయా రాష్ర్టాల్లో శాశ్వతంగా బీజేపీ అధికారంలో ఉంటుందని, డీలిమిటేషన్ చట్టం నిర్ణయాల్ని కోర్టుల్లో సవాలు చేసే అవకాశం లేదన్నారు. ప్రతిపక్ష పార్టీలు బీజేపీ ప్రతిపాదనకు తలొగ్గితే దేశంలో ప్రజాస్వామ్యానికి పెను ముప్పు వాటిల్లుతుందన్నారు.