Yellamma Movie : ‘బలగం’ చిత్రంతో తెలుగు ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న దర్శకుడు వేణు యెల్దండి, ప్రస్తుతం తన తదుపరి ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ‘ఎల్లమ్మ’ పనుల్లో నిమగ్నమయ్యారు. ఈ సినిమా అప్డేట్ను పంచుకుంటూ, ఇప్పటికే 60 శాతం చిత్రీకరణ విజయవంతంగా పూర్తయిందని ఆయన వెల్లడించారు. తాజాగా ఆంధ్రప్రదేశ్లోని ప్రఖ్యాత పర్యాటక ప్రాంతమైన గండికోటలో మూడు రోజుల పాటు కీలక సన్నివేశాలను చిత్రీకరించినట్లు తెలిపారు. ఈ షెడ్యూల్ ముగిసిన అనంతరం వేణు కడపలోని ప్రసిద్ధ దర్గాను సందర్శించి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. గ్రామీణ నేపథ్యం, బలమైన భావోద్వేగాలతో రూపొందుతున్న ఈ చిత్రం ప్రేక్షకుల అంచనాలను తప్పకుండా అందుకుంటుందని ఆయన పూర్తి ధీమా వ్యక్తం చేశారు.

మార్చి 5న గ్రాండ్ రిలీజ్.. ‘బలగం’ తరహా కథలకే ప్రాధాన్యం:
సినిమా విడుదల తేదీపై స్పష్టతనిస్తూ, ముందుగా ప్రకటించిన విధంగానే వచ్చే ఏడాది మార్చి 5న ‘ఎల్లమ్మ’ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా విడుదల చేయనున్నట్లు వేణు స్పష్టం చేశారు. కేవలం కమర్షియల్ హంగులకే పరిమితం కాకుండా, మన సంస్కృతి, సంప్రదాయాలు, మట్టి వాసన తెలిపే ‘బలగం’ తరహా కథలతోనే భవిష్యత్తులోనూ మరిన్ని సినిమాలు రూపొందిస్తానని ఆయన పేర్కొన్నారు. దర్శకుడిగా తనదైన ముద్ర వేసుకున్న వేణు, ‘ఎల్లమ్మ’తో మరోసారి బాక్సాఫీస్ వద్ద మ్యాజిక్ చేయడం ఖాయమని సినీ వర్గాల్లో అంచనాలు నెలకొన్నాయి.