Satyasai : పుట్టపర్తి సత్యసాయి బాబా బోధనలు తనను ఎంతగానో ప్రభావితం చేశాయని ప్రముఖ నటి రష్మిక మందన్న తెలిపారు. పుట్టపర్తిలో నిర్వహించిన సత్యసాయి బాబా 101వ జయంతి వేడుకల్లో పాల్గొన్న ఆమె.. స్వామివారి సందేశాలు, సేవా భావం, మానవత్వ విలువల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన కుటుంబానికి కూడా పుట్టపర్తితో ప్రత్యేక అనుబంధం ఉందని వెల్లడించారు. తన భర్త విజయ్, మరిది ఆనంద్ ఇద్దరూ పుట్టపర్తిలోని సత్యసాయి విద్యా సంస్థల్లో చదువుకున్నారని చెప్పారు. అంతేకాకుండా తన అత్తమామలు కూడా సత్యసాయి బాబా భక్తులని వివరించారు. ఈ కారణంగా స్వామివారి గురించి, ఆయన బోధనల గురించి తెలుసుకునే అవకాశం తనకు లభించిందని పేర్కొన్నారు.

ఒక్క అడుగు వేస్తే.. వంద అడుగులు వేస్తా!
సత్యసాయి బాబా చెప్పిన మాటల్లో తనను ప్రత్యేకంగా ఆకర్షించిన బోధన గురించి రష్మిక ప్రస్తావించారు. ‘తనవైపు ఒక అడుగు వేసినవారి కోసం వంద అడుగులు వేస్తాను’ అన్న స్వామివారి సందేశం తన మనసుపై చెరగని ముద్ర వేసిందని తెలిపారు. ఎదుటివారు మనపై చూపించే ప్రేమ, నమ్మకం, ఆప్యాయతకు వంద రెట్లు తిరిగి స్పందించాలనే గొప్ప భావన ఈ మాటల్లో ఉందని ఆమె అభిప్రాయపడ్డారు. మనుషుల మధ్య ప్రేమ, పరస్పర గౌరవం, సేవాభావం ఉండాలనే సత్యసాయి బాబా సందేశాలు నేటి సమాజానికి కూడా ఎంతో అవసరమని ఆమె వ్యాఖ్యలు తెలియజేస్తున్నాయి. సత్యసాయి జయంతి వేడుకల్లో రష్మిక చేసిన ఈ వ్యాఖ్యలు అభిమానులు, భక్తుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి.