
Coca-Cola : ఆంధ్రప్రదేశ్లో పారిశ్రామిక అభివృద్ధికి మరో కీలక ముందడుగు పడింది. ప్రముఖ శీతల పానీయాల తయారీ సంస్థ హిందుస్థాన్ కోకాకోలా బేవరేజెస్ ప్రైవేట్ లిమిటెడ్ (HCCB) రాష్ట్రంలో రూ.1,127 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది. ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో ఈ భారీ పెట్టుబడి ప్రతిపాదనకు సంబంధించిన ప్రభుత్వ ఉత్తర్వులను (జీఓ) ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంస్థ ప్రతినిధులకు అందజేశారు. విశాఖపట్నంలో జరుగుతున్న 31వ సీఐఐ భాగస్వామ్య సదస్సు–2026 వేదికగా ప్రభుత్వ ఉన్నతాధికారులు, పారిశ్రామిక రంగ ప్రముఖుల సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది. HCCBలో ఇంటిగ్రేటెడ్ సప్లై చైన్ విభాగం అధిపతి అవినాష్ కాంత్ కుమార్ ఈ ఉత్తర్వులను స్వీకరించారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో తయారీ, పంపిణీ కార్యకలాపాలు నిర్వహిస్తున్న సంస్థ తాజాగా రూ.1,127 కోట్ల పెట్టుబడితో తన వ్యాపార కార్యకలాపాలను మరింత విస్తరించేందుకు సిద్ధమైంది. రాష్ట్రంలో పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణాన్ని కల్పించడం, పారిశ్రామిక సంస్థలకు అవసరమైన అనుమతులను వేగంగా అందించడం ద్వారా మరిన్ని కంపెనీలను ఆకర్షించాలనే ప్రభుత్వ ప్రయత్నాలకు ఈ పరిణామం బలాన్నిస్తోంది.
Read Also : విశాఖ–తిరుపతి మధ్య మరో వందేభారత్ రైలు
రెండు దశాబ్దాల అనుబంధం.. ఏపీలో కార్యకలాపాల విస్తరణకు కోకాకోలా సిద్ధం
ఈ సందర్భంగా HCCB ప్రతినిధి అవినాష్ కాంత్ కుమార్ మాట్లాడుతూ.. గత రెండు దశాబ్దాలుగా ఆంధ్రప్రదేశ్ తమ సంస్థ ప్రయాణంలో కీలక భాగస్వామిగా కొనసాగుతోందని తెలిపారు. రాష్ట్రంలో తమ బాట్లింగ్ కార్యకలాపాలు, వ్యాపార భాగస్వామ్యాలు, సామాజిక కార్యక్రమాల ద్వారా అభివృద్ధిలో భాగస్వాములవుతున్నామని పేర్కొన్నారు. తమ సంస్థపై నమ్మకంతో భారీ పెట్టుబడికి అనుమతులు మంజూరు చేసిన రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులో రాష్ట్రంలో కార్యకలాపాలను మరింత విస్తరించి పారిశ్రామిక అభివృద్ధికి సహకరిస్తామని వెల్లడించారు. ప్రస్తుతం HCCBకి గుంటూరు జిల్లా ఆత్మకూరు, తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో తయారీ కేంద్రాలు ఉన్నాయి. ఈ కేంద్రాల ద్వారా శీతల పానీయాల తయారీతో పాటు పంపిణీ కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. తాజాగా ప్రతిపాదించిన రూ.1,127 కోట్ల పెట్టుబడి ఫుడ్ ప్రాసెసింగ్ రంగానికి మరింత ఊతమివ్వడంతో పాటు అనుబంధ పరిశ్రమలు, సరఫరా వ్యవస్థలు, పారిశ్రామిక వ్యాపారాలకు కొత్త అవకాశాలను కల్పించే అవకాశం ఉంది. విశాఖ సీఐఐ భాగస్వామ్య సదస్సు ద్వారా రాష్ట్రానికి భారీ పెట్టుబడులు తీసుకురావాలనే లక్ష్యంతో ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాల్లో కోకాకోలా పెట్టుబడి మరో ముఖ్యమైన పరిణామంగా నిలిచింది.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :