Salman Khan : బాలీవుడ్ అగ్ర కథానాయకుడు సల్మాన్ ఖాన్ తన ప్రాణభయంపై తొలిసారిగా బహిరంగంగా స్పందిస్తూ భావోద్వేగానికి లోనయ్యారు. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి వస్తున్న వరుస హత్య బెదిరింపుల నేపథ్యంలో, ఆయనకు ప్రభుత్వం అత్యంత కట్టుదిట్టమైన ‘వై-ప్లస్’ (Y-Plus) కేటగిరీ భద్రతను కల్పించింది. అయితే, తాజాగా హైదరాబాద్లో జరిగిన ‘మాతృభూమి’ ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్న సల్మాన్, తన మనసులోని ఆవేదనను పంచుకున్నారు. చుట్టూ ఇంత మంది భద్రతా సిబ్బంది, కట్టుదిట్టమైన సెక్యూరిటీ ఉన్నప్పటికీ.. ఎప్పుడు ఏం జరుగుతుందోననే భయం తనను నిరంతరం వెంటాడుతూనే ఉంటుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

తల్లిదండ్రుల ఆందోళనను గుర్తుచేసుకున్న కండల వీరుడు
ఈ సందర్భంగా ఒక సాధారణ కొడుకుగా తల్లిదండ్రుల మనోభావాలను సల్మాన్ ఖాన్ గుర్తుచేసుకున్నారు. ఎవరైనా సరే ఇంట్లో నుంచి బయటకు అడుగుపెట్టినప్పుడు, వారు తిరిగి సురక్షితంగా ఇంటికి చేరుకోవాలని ప్రతి తల్లిదండ్రులు ఎంతో ఆశగా కోరుకుంటారని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం తాను ఎదుర్కొంటున్న పరిస్థితుల వల్ల తన కుటుంబ సభ్యులు కూడా తీవ్ర ఆందోళన చెందుతున్నారని పరోక్షంగా వెల్లడించారు. స్టార్ హీరోగా కోట్లాది మంది అభిమానులను అలరిస్తున్న సల్మాన్ ఖాన్, నిత్యం ప్రాణభయంతో గడుపుతున్నానని చెప్పడం ఇప్పుడు సినీ వర్గాల్లో, అభిమానుల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.