Road Accident : రాజస్థాన్ (Rajasthan) లో ఘోర రోడ్డు ప్రమాదం (Road accident) జరిగింది. రోడ్డుపక్కన ఆగి ఉన్న లారీని టెంపో వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన తొమ్మిది మంది భక్తులు ప్రాణాలు కోల్పోయారు. కోటా-ఉదయ్ జాతీయ రహదారిపై ఆదివారం తెల్లవారుజామున ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో మరికొందరు గాయపడ్డారు. వారు సమీప ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
వివరాల్లోకి వెళ్తే.. మహారాష్ట్రకు చెందిన 16 మంది భక్తులు రాజస్థాన్లోని ఖాటూశ్యామ్ ఆలయానికి వెళ్లారు. అనంతరం శనివారం రాత్రి మహారాష్ట్రకు తిరుగుపయనమయ్యారు. ఈ క్రమంలో ఈ తెల్లవారుజామున రోడ్డుపై పార్క్ చేసి ఉన్న లారీని వారి వాహనం బలంగా ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు.