Telangana SI Exam: తెలంగాణలో సబ్ ఇన్స్పెక్టర్ (SI) ఉద్యోగాల నియామక ప్రక్రియ తుది దశకు చేరుకుంటోంది. ఈ నెల 29వ తేదీన జరగనున్న ఎస్సై ప్రిలిమినరీ రాత పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లను నవంబర్ 22 నుంచి విడుదల చేయనున్నట్లు తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీస్ నియామక మండలి (TSLPRB) ఛైర్మన్ వి.వి. శ్రీనివాసరావు శుక్రవారం ఒక అధికారిక ప్రకటనలో వెల్లడించారు.

అభ్యర్థులు నియామక మండలి అధికారిక వెబ్సైట్ tgprb.in లోకి లాగిన్ అయి ఈ నెల 28వ తేదీ వరకు తమ హాల్‌టికెట్లను డౌన్లోడ్ చేసుకునే అవకాశం కల్పించారు. హాల్‌టికెట్లు డౌన్లోడ్ చేసుకునే క్రమంలో ఏవైనా సాంకేతిక ఇబ్బందులు తలెత్తితే support@tslprb.in కు ఈ-మెయిల్ పంపడం ద్వారా లేదా 040-41895151 హెల్ప్‌లైన్ నంబర్‌కు కాల్ చేసి పరిష్కరించుకోవచ్చని ఛైర్మన్ సూచించారు.
Telangana SI Exam: హాల్‌టికెట్‌పై ఫొటో తప్పనిసరి.. నిబంధనలు ఇవే
పరీక్ష కేంద్రానికి వచ్చే అభ్యర్థులు తమ హాల్‌టికెట్‌పై పాస్‌పోర్టు సైజు ఫొటోను విధిగా అతికించుకుని రావాలని బోర్డు స్పష్టం చేసింది. ముఖ్యంగా ఆన్లైన్ దరఖాస్తు సమయంలో అప్లోడ్ చేసిన ఫొటోనే అతికించాల్సి ఉంటుందని పేర్కొంది. ఫొటో లేకుండా పరీక్ష హాల్‌కు వచ్చే అభ్యర్థులను ఎట్టి పరిస్థితుల్లోనూ లోపలికి అనుమతించబోమని ఛైర్మన్ హెచ్చరించారు.