షేర్: f 𝕏 ✉ ✈ in @
pnbnews.in 21 నవం 2026, 6:02 ఉద.
క్రైమ్

Crime News | హంత‌కుడిని ప‌ట్టించిన బంగారు ఉంగ‌రం.. ఎలాగంటే..!

Telugu news from Telangana and Andhra Pradesh
ప్రచురణ తేదీ: 21 నవం 2026, 6:02 ఉద. రచన: One News Desk
6 వీక్షణలు 0 వ్యాఖ్యలు
Crime News | హంత‌కుడిని ప‌ట్టించిన బంగారు ఉంగ‌రం.. ఎలాగంటే..!

Crime News : ఒక మ‌హిళ‌పై అత్యాచారానికి పాల్ప‌డి, హ‌త్య చేసిన వ్య‌క్తిని మృతురాలి ఒంటిపై ఉన్న బంగారు ఉంగ‌రం (Gold ring) ప‌ట్టించింది. తమిళనాడు (Tamil Nadu) రాష్ట్రం కన్యాకుమారి (Kanyakumari) జిల్లాలోని నాగర్‌కోయిల్ రైల్వే యార్డు (Railway Yard) లో నిలిపి ఉంచిన ఒక పాత రైలుబోగీలో ఈ నెల 13న యాభై నాలుగేళ్ల మహిళ హ‌త్య‌కు గురైంది. నిందితుడు ముందుగా ఆమెపై అత్యాచారానికి పాల్ప‌డి, ఆపై హ‌త్య‌చేసిన‌ట్లుగా ప్రాథ‌మిక దర్యాప్తులో తేలింది. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసిన పోలీసుల‌కు ఎలాంటి క్లూ లేక‌పోవ‌డం సవాల్‌గా మారింది.

ఈ క్ర‌మంలో మృతురాలి ఒంటిపై ఉన్న బంగారు ఉంగ‌రం కీల‌క క్లూగా మారింది. పాము ఆకారంలో డిజైన్ చేసి ఉన్న ఆ బంగారు ఉంగరం ఆధారంగా పోలీసులు కేసును చేధించారు. రైల్వే పోలీసులు వెల్ల‌డించిన వివ‌రాల ప్ర‌కారం.. ఆ ఉంగరంపై ఉన్న హాల్‌మార్క్ గుర్తులను బట్టి అది గుజరాత్‌కు చెందినదని పోలీసులు గుర్తించారు. అక్కడ ఉంగ‌రం విక్రయించిన వ్యక్తిని విచారించగా ఆ ఉంగరాన్ని ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లో ఉండే ఒక రిటైలర్‌కు పంపినట్లు తేలింది.

ఈ ఆధారంతో పోలీసులు ఆ రిటైల‌ర్ ద‌గ్గ‌రికి వెళ్లి మృతురాలి పాన్ వివరాలను, అలాగే నగలు కొనుగోలు చేసేటప్పుడు ఆమె ఇచ్చిన మధ్యప్రదేశ్‌కు చెందిన చిరునామాను సేకరించారు. పోలీసులు అక్క‌డికి వెళ్లి కుటుంబాన్ని గుర్తించారు. స‌ద‌రు మ‌హిళ మూడు నెల‌ల క్రిత‌మే ఇళ్లు విడిచి వెళ్లిన‌ట్లు వెల్ల‌డైంది. మ‌ర‌ణ‌వార్త తెలియ‌డంతో ఇప్పుడు ఆమె భ‌ర్త‌, పిల్ల‌లు క‌న్యాకుమారికి బ‌య‌లుదేరారు. దర్యాప్తు ప్రారంభించిన ఆరు గంటల్లోనే నిందితుడిని అరెస్టు చేశారు.

అధికారులు మొదట ముగ్గురు అనుమానితులను గుర్తించారు. దర్యాప్తులో రైల్వే స్టేషన్‌లోని సీసీటీవీ ఫుటేజ్ కీలకమైంది. ఆ ఫుటేజ్‌లో తెల్లటి దుస్తులు ధరించిన ఒక వ్యక్తి కోచ్‌లలో ఒకదాని నుంచి బయటకు వస్తున్నట్లు కనిపించింది. అత‌డి త‌మ‌దైన స్టైల్‌లో పోలీసులు విచారించగా నేరాన్ని అంగీకరించినట్లు సమాచారం. రైల్వేస్టేషన్ ప్లాట్‌ఫామ్‌పై తిరిగే ఒక బిచ్చగాడిగా అత‌డిని గుర్తించారు. గతంలో ఆ మహిళను హంత‌కుడు కొన్నిసార్లు కలిసినట్లుగా కూడా అనుమానిస్తున్నారు.

నిందితుడు ధరించి కాలువలో పారవేసినట్లుగా భావిస్తున్న రక్తపు మరకలున్న చొక్కాను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తమిళనాడు రైల్వేస్ డీజీపీ కె వన్నియా పెరుమాళ్ ఈ దర్యాప్తును, ముఖ్యంగా రైల్వే ఎస్పీ చేసిన కృషిని అభినందించారు. మరణానికి కారణాన్ని నిర్ధారించడానికి, లైంగిక దాడిని ధృవీకరించడానికి మహిళ మృతదేహాన్ని పోస్ట్‌మార్టం పరీక్షకు పంపారు. నిందితుడు మహిళపై లైంగికదాడి చేసి, శారీరకంగా హింసించి, ఛాతీపై తన్ని చంపినట్లు ఒప్పుకున్నాడని అధికారులు చెబుతున్నారు.

#క్రైమ్ #క్రైమ్వార్తలు
Crime News : ఒక మ‌హిళ‌పై అత్యాచారానికి పాల్ప‌డి, హ‌త్య చేసిన వ్య‌క్తిని మృతురాలి ఒంటిపై ఉన్న బంగారు ఉంగ‌రం (Gold ring) ప‌ట్టించింది. తమిళనాడు (Tamil Nadu) రాష్ట్రం…