
జగిత్యాల : జగిత్యాల జిల్లా కొండగట్టు ( Kondagattu ) ఆంజనేయస్వామి ఆలయంలో నిర్వహించనున్న చందనోత్సవాల సందర్భంగా ఈ నెల 20వ తేదీ నుంచి డిసెంబర్ 29వ తేదీ వరకు పటిష్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయనున్నట్లు జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ( SP Ashok Kumar) తెలిపారు. సంబంధిత పోలీస్, ఇతర శాఖల అధికారులతో కలిసి గురువారం కొండగట్టు ఆలయ పరిసర ప్రాంతాలను సందర్శించి బందోబస్తు ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
భక్తుల రద్దీకి అనుగుణంగా చేపట్టాల్సిన భద్రతా చర్యలు, ట్రాఫిక్ నియంత్రణ, వాహనాల పార్కింగ్, భక్తుల రాకపోకలు, క్యూలైన్ల నిర్వహణ తదితర అంశాలపై అధికారులకు పలు సూచనలు చేశారు. చందనోత్సవాలకు వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు కొండగట్టుకు వచ్చే అవకాశం ఉన్నందున ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు ప్రణాళికతో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఆలయ పరిసర ప్రాంతాల్లో నిరంతరం నిఘా ఉంచాలని, రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో పోలీస్ సిబ్బంది అప్రమత్తంగా విధులు నిర్వహించాలని ఆదేశించారు.
ఆలయానికి వచ్చే భక్తుల వాహనాల రాకపోకల వల్ల ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని, వాహనాలను నిర్దేశించిన పార్కింగ్ ప్రదేశాల్లోనే నిలిపేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎస్పీ వెంట డీఎస్పీ పురుషోత్తం రెడ్డి, మల్యాల సీఐ రాజ్ కుమార్, ఎస్సైలు సందీప్, నరేష్, సిబ్బంది పాల్గొన్నారు.